Sunday 1 June 2014

ఆ బ్రహ్మ వొచ్చి బతిమాలాడు

నీకోసం కవిత రాద్దాం అనుకుంటా..
చేయి కీబోర్డు మీటదాకా వెళ్ళగానే
నువ్వు తప్ప ఇంకేమీ గుర్తురాదు మెదడుకి..
నా వేళ్ళు కీబోర్డు నుంచి నావైపు తిరిగి 
తిడుతూ ఉంటాయ్ ఇంకెంతసేపురా ఆలోచిస్తావ్..
త్వరగా ఏదో ఒకటి చెప్పు టైపు చేస్తా అని..!
కానీ ఎన్నిటైపుల్లో ఆలోచించినా ఒక్కక్షరం కూడా
బయటకు రామంటూ తలుపులేసుకుంటున్నాయి..
కానీ అప్పుడే నీ జ్ఞాపకాలు 
అక్షరాలు రాకపోతేనేం, నీకు మేమున్నాం 
అంటూ అదాటున అల్లేశాయి..
నువ్వు చెప్పిన మాటలన్నిటినీ కట్టిన మూటలు
ఎన్ని ఉన్నాయో అవన్నీ వొంపుకున్నా.. చాలా పెద్ద
కుప్పే అయ్యింది.. ఇంతలో నీకోసం నేను కన్న కలలన్నిటినీ
బధ్రంగా దాచిన దారి కనపడే సరికి వాటిని వెతికి తీసుకొచ్చి
కుప్పగా పోయటానికి ఎన్ని తిప్పలు పడ్డానో..
ఇలా నీ ఊహలు, నీ చేష్టలు, నీ అల్లర్లు, నాతో పంచుకున్న
అనుభవాలూ అన్నిటినీ తెచ్చి కుప్పలుగా పోశా
సరిపోలా ఆ స్థలం..
ఐనా సరే పోస్తూనే ఉన్నా..
ఆఖరుకి చూస్తే, నేను శూన్యంలో ఉన్నా,
ఆ కుప్పల తెప్పలకి
భూమి సరిపోలా..
సౌరకుటుంబం సరిపోలా..
విశ్వం కూడా నిండిపోతుంటే, ఒక్కసారిగా
ఆ బ్రహ్మ వొచ్చి బతిమాలాడు, నువ్విలా విశ్వాన్నంతా నింపేస్తే
నేను పుట్టించే జీవాలకి చోటు లేదంటూ..
అయీనా వినలేదు.. వినలేను..
ఎందుకంటే నాకు తెలిసినంత వరకు
విశ్వంలో ప్రతీ అణువులోనూ నువ్వూ
నీ ప్రేమ తప్ప ఇంకేమీ లేదు మరీ..!
ఇట్లు నీ నేను  సత్యం జి, 01-06-2014, 22:15

Thursday 28 February 2013

పొగరు


అవునూ.. నాక్కొంచెం పొగరెక్కువే..
నీకోసం ప్రతీ క్షణం పరితపిస్తూ
నీతొ మాట్లాడాలని తహతహలాడే
ఈ హృదయాన్ని నీవు పట్టించుకోకుండా
వదిలేసినప్పుడు, ప్రతి రోజూ నీతో మాట్లాడే
మనసుని ఒక్కసారిగా ఉత్సాహంగా
పరుగులు తీస్తున్న నదికి ఇసుక బస్తాల
ఆనకట్ట.. కాదు కాదు అడ్డుకట్ట వేసినప్పుడు

పోనీలే నీకు కూడా నేను తగనేమో
అని తలపుల తలుపులు మూసేసి
తలకింద దిండు పెట్టుకుని హాయిగా
పడుకుందామంటే, ఏదీ నిదుర రాదే..
నీ ఆలోచనలే.. కనురెప్పలు మూయటమే ఆలస్యం
నా కళ్లముందు ప్రత్యక్షమవుతోంది నీ రూపం..
సరే కదా అని మళ్ళీ లేచి

ఫోను బుక్కులో నీ నెంబరు చూసి
డయలు చేశాను.. అప్పుడు నా ఫోను స్క్రీను
నన్ను వెక్కిరింతగా చూస్తోంది.. ఎన్ని సార్లు
చేస్తావ్ రా తనెలాగు ఎత్తదు.. పిచ్చోడా.. అని..
అయినా సరే దాని నోరు మూసి నీ నోటి మాటకై
ఫోను చేస్తే పాపం నీ ఫోను నువ్వు గొంతు నొక్కేసిన సంగతి
నాకు గుర్తురాలేదు.. పాపం అయినా నీ ఫోను నాకోసం
ఆ మూగ గొంతుతో కూడా అరుస్తూనే ఉంది..
నువ్వే పట్టించుకోలేదు..

అందుకే అలిగాను.. నీకేమైంది అని అడిగాను..

నిజమే నాక్కొంచెం పొగరెక్కువే
మండుటెండలలో చల్లటి చెట్టునీడ లాంటిది నీ
స్నేహం అనుకున్నను కదా అందుకు..
మంచు తెన్నెల్లో వె్న్నెల లాంటిది నీ
సాంగత్యం అనుకున్నాను కదా అందుకు..

- Satyam Gaddamanugu, 28-02-2013, 14:37pm

Monday 16 July 2012

కత్తి తీసుకుని నన్ను ముక్కలు చేసి చంపెయ్యి


నిన్ను కలవకముందు ప్రేమంటే పిచ్చి అనుకున్నా..
కానీ ఎందుకో తెలియదు,
నువ్వు దూరమవుతున్న ప్రతీ క్షణం నాకు పిచ్చెక్కిపోతోంది..!
ఎదో తెలియని బాధ..
ఎన్నో కావ్యాలు పలికిన నా పెదవులకి ఈరోజు
ఈ బాధని వర్ణించటానికి పదాలే రావటం లేదు..
గుండెని ఎవరో పిండేస్తున్నట్లుంది..
నువ్వు నా కళ్ళెదుటే ఉన్నా కానట్టు ఉంటుంటే
ఈ దేహం కాలి బూడిదైపోయినా మంచిదనిపిస్తోంది..
కత్తి తీసుకుని నన్ను ముక్కలు చేసి చంపెయ్యి, కానీ
ఇలా కళ్ళెదుటే ఉంటూ కానరాని నరకాన్ని చూపించి క్షణానికి  పదిసార్లు చంపద్దు..!

Sunday 8 July 2012

వేయి నరకాలైనా సహిస్తాను కానీ..,

నీ అధరాల మధురిమలు చాలు
నేను జన్మజన్మలు గడపడానికి..

కానీ, ఎందుకో తెలియదు..
నీ ఎడబాటును క్షణమైనా భరించలేను...

వేయి నరకాలైనా సహిస్తాను కానీ
నీ ఎడబాటుని క్షణమైనా తట్టుకోలేను..

ఎన్నటికీ నాచేయి విడువవనే
నమ్మకమే ఇప్పుడు నన్ను బ్రతికిస్తోంది..!

జామురాతిరివేళ చల్లని జాబిలి

చెలియా.. నీ చూపులు నన్ను తాకిన క్షణమున
చిరుజల్లుల చల్లని తేనెలు
నా హ్రుదయాన్నే తడిపేస్తున్నాయా అనిపిస్తోంది..

ఏదో తెలియని ఉత్సాహం..
ఎందుకో తెలియని ఆనందం..

జామురాతిరివేళ చల్లని జాబిలి
వెన్నెలలు కురిపిస్తోందా అనిపిస్తోంది నీ నవ్వు చూస్తుంటే..